ఈ మధ్య కాలంలో టెకీలందరూ పేటెంట్ల గురించిన వార్తలు వినే ఉంటారు.
మొబైలు టెక్నాలజీలలో పని చేసే వారయితే తప్పకుండా పేటెంట్ల గురించి విని, చదివే ఉంటారు.

అయితే పేటెంట్ల మీద అవగాహన మాత్రం జనాలకు తక్కువే అనిపిస్తుంది.

పేటెంట్ల మీద కొద్దిగా ఉపోద్ఘాతం:

అసలు పేటెంట్ అంటే ఏమిటి ?
ఈ సందర్భం ఊహించుకోండి. మీకు ఒక సరికొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీకు లాభం చేకూర్చేది అయి ఉంది. కానీ అదే ఆలోచనని ఇతరులు ఉపయోగించుకుని లాభం పొందుతారని మీకు అనిపించిందనుకోండి. దానిని కాపాడుకోవడమెలా ?
అలా మీ ఆలోచనని కాపాడుకోవడానికి సృష్టించిన ఒక విధానమే ఈ పేటెంటు.
అయితే పేటెంట్ ఒక చోట దరఖాస్తు చేస్తే అది అన్నిచోట్లా చెల్లుబాటు అవదు.

ఉదా: అమెరికాలో మీరు పేటెంట్ చెయ్యదలచుకున్నారనుకోండి దానికి మీరు యూఎస్ పీటీఓ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
అదే భారతంలో అయితే ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలి.

అయితే చాలా సార్లు అన్ని దేశాలలోనూ పేటెంట్ చెయ్యడం కుదరకపోవచ్చు. (పేటెంట్ దరఖాస్తు చెయ్యడానికి అయ్యే ఖర్చు తక్కువేమీ కాదు)
అప్పుడు ఏ దేశాలలో అయితే మీ ఆలోచనకి మార్కెట్టు ఎక్కువుంటుందో ఆ దేశాలలో మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కువగా టెక్నాలజీకి సంబంధించిన మార్కెట్టు అమెరికా, యూరప్ లలో కాబట్టి ఆయా దేశాలలో ఎక్కువగా దరఖాస్తు చేస్తుంటారు.

కొన్ని దేశాల మధ్య పేటెంట్ ట్రీటీలు ఉన్నాయి. పేటెంట్ కోపరేషన్ ట్రీటీ గురించి చదవండి.

అయితే వేటిని పేటెంట్ చెయ్యవచ్చు, దాని విధానమేమిటనేది అనేది  కూడా ఆయా దేశాల చట్టాల ప్రకారం మార్పులు చెందుతుంది.

కానీ స్థూలంగా కొన్ని సూత్రాలు
  • ఇంతకు ముందెవరూ ఆ ఆలోచనని పేటెంట్ చెయ్యకుండా ఉండాలి
  • ఆ ఆలోచన సరికొత్తదయి ఉండాలి
  • ఆ ఆలోచన కొత్త కల్పన అయి ఉండాలి
  • ఆ ఆలోచనకి ఉపయోగం ఉండాలి
  • ఆ ఆలోచన ఏ పబ్లికేషను లోనూ ప్రచురించి ఏడాది కాకూడదు
వేటిని పేటెంట్ చెయ్యవచ్చు
  • ఒక కొత్త ఉత్పత్తి
  • ఒక కొత్త విధానము
  • ఒక కొత్త సాంకేతిక విధానము మొ.
ఒక పేటెంట్ దరఖాస్తు చేసుకోవడానికి ముందు ప్రయర్ ఆర్ట్ తెలుసుకోవడం ముఖ్యం. చాలా సార్లు మన ఆలోచన ఇప్పటికే ఎవరో ఒకరు పేటెంట్ చేసి ఉండవచ్చు. అది తెలుసుకోకుండా మళ్ళీ మనం దానిని పేటెంట్ చెయ్యడానికి ప్రయత్నిస్తే డబ్బూ, శ్రమ వృధా. అందుకనే మనకి వచ్చిన ఆలోచనని ఇంతకు ముందే ఎవరయినా పేటెంట్ చేసారా అని శోధించుకోవాలి.
ఆ శోధన కోసం ఎన్నో ఉపకరణాలు ఉన్నాయి. గూగుల్ పేటెంట్ సెర్చ్ , యూఎస్ పీటీఓ సెర్చ్ మొదలగునవి.

చాలా మటుకు పేటెంట్లు కంపెనీల నుండి దరఖాస్తయి ఉంటాయి. అది ఎందుకంటే చాలా మటుకు కంపెనీలు తమ ఉద్యోగులు దరఖాస్తు చేసే పేటెంట్ల మీద హక్కులు తమకే చెందుతాయని తమ ఆఫర్ లలో పేర్కొంటాయి.
కంపెనీలలో పేటెంట్ లాయర్లు ఉంటారు. వారు ఏ విధంగా పేటెంట్ దరఖాస్తు చెయ్యాలో మీకు దిశా నిర్దేశం చేస్తారు. అదే విధంగా ఏయే దేశాలలో పేటెంటు చెయ్యాలో కూడా బేరీజు వేస్తారు.

మరి ఈ పేటెంట్ల వల్ల అవి దరఖాస్తు చేసుకునే వారికి లాభం ఏమిటి ?
  • మీ ఆలోచనని మీ అనుమతి లేకుండా ఎవరూ వాడుకోలేరు
  • మీ ఆలోచనని ఇతరులకు లైసెన్స్ చేసి దాని మీద డబ్బు (రాయల్టీ) సంపాదించవచ్చు
  • మీ కంపెనీ ఆర్&డీ కి ఖర్చుని పేటెంట్ల ద్వారా కాపాడుకోవచ్చు
అయితే ఈ పేటెంట్ల వల్ల అన్నీ లాభాలేనా అంటే అది కొత్త కల్పనలకి ఆటంకం అని వాదించేవారూ లేకపోలేదు.
వీటిని అడ్డం పెట్టుకుని కంపెనీలు బెదిరింపులకి పాల్పడి ఇతర కంపెనీలను మంచి ఉత్పత్తులని తయారు చెయ్యడానికి నిరుత్సాహపరుస్తాయని కూడా ఒక వాదన ఉంది.

ఈ మధ్య ఈ పేటెంట్లు ఇంతగా ఆసక్తి కలిగించడానికి కారణం మొబైలు విపణిలో వివిధ కంపెనీల మధ్య సాగుతున్న యుద్ధాలే.
ముఖ్యంగా ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య.

ఆండ్రాయిడ్ ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్ పెంచుకోవడంతో ఇతర కంపెనీలు వాటిని పేటెంట్లతో ఎదుర్కొంటున్నాయి.
మైక్రోసాఫ్ట్ దాదాపు అన్ని ఆండ్రాయిడ్ తయారీదారుల నుంచీ రాయల్టీ వసూలు చేస్తుంది. హెచ్టీసీ నుంచి దాదాపు ప్రతీ ఆండ్రాయిడ్ హాండ్‌సెట్ పైనా దాదాపు ఐదు డాలర్లు వసూలు చేస్తుంది. మైక్రోసాఫ్ట్ కున్న వైవిధ్యమయిన పేటెంట్ల వల్ల ఇది సాధ్యపడుతుంది.

దానికి ప్రతిగా గూగుల్ సంస్థ నార్టెల్‌కు సంబంధించిన పేటెంట్ల హక్కులను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నిస్తే దానిని మిగతా అన్ని ప్రముఖ మొబైల్ కంపెనీలూ కన్సార్టియంగా ఏర్పడి ఎదుర్కొని ఎంతో ఎక్కువ వ్యయానికి కొనుగోలు చేసాయి. ఇదంతా గూగుల్ ఆండ్రాయిడ్ ఎదుగుదలని ఎదుర్కోవడానికి వాటి యుక్తులు.

అందుకే ఇప్పుడు ఆయా కంపెనీలని ఎదుర్కోవడానికి గూగుల్ ఏకంగా మోటరోలా వైర్‌లెస్ డివిజన్‌నే పన్నెండున్నర బిలియన్ల డాలర్లకి కొనుగోలు చేసేసింది. దానితో పాటూ దానికి సంబంధించిన పేటెంట్లనూ.

అదీ క్లుప్తంగా పేటెంట్ల కథా కమామీషూ!